ప్రతి నలభై సెకన్లకు ఒకరు ఆత్మహత్య.. కానీ ఉన్నది ఒకటే జిందగీ!

ఓడిపోవడం తప్పు కాదు.. విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీయలేక కొందరు, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక.. ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. ఆత్మహత్యల నివారణపై అవగాహణ కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం (ఐఏఎస్‌పీ) ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎంహెచ్)ల సహకారంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీని 2003 నుంచి ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం’గా నిర్వహిస్తున్నారు.

డబ్ల్యూహెచ్ఓ తాజా గణాంకాల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్య సగానికి పైగా ఉంది. 15-29 ఏళ్ల మధ్య వారిలో రోడ్డుప్రమాద మరణాల తర్వాత రెండో కారణంగా ఆత్మహత్యలు ఉండటం విచారకరం. బలవన్మరణాలపై పెద్దగా చర్చ జరగడం లేదని భావించి ఐఏఎస్‌పీ, డబ్ల్యూహెచ్ఓలు దశాబ్ధన్నరం నుంచీ ప్రతి ఏడాది ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తోంది. కుటుంబం, స్నేహితులు, ప్రేమ, ఆర్థిక కారణాలతో తనువు చాలిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అడనామ్ ఘెబ్రెయేసస్ తెలిపారు. అవగాహన కల్పించి ఆత్మహత్యల వల్ల నష్టాలు, అనంతర పరిణామాలు వివరిస్తే కొద్దిమేర వీటిని నివారించవచ్చు. ఒకరు సూసైడ్ చేసుకుంటే దాని ప్రభావం దాదాపు 135 మందిపై పడుతుందని అమెరికన్లు చేసిన ఓ అధ్యయనంలో గతంలో వెల్లడైంది.

ఆ లక్షణాలు కనిపిస్తే ఆత్మహత్య ఆలోచనలున్నట్టే!
రీసెర్చర్ల అధ్యయనం ప్రకారం.. ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అని, పదే పదే ఆత్మహత్య గురించి మాట్లాడుతారో, తమకు తామే హాని చేసుకోవడానికి యత్నిస్తారో వారిలో ఆత్మహత్య ఆలోచనలు ఉంటాయి. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ప్రతి సందర్భంలోనూ చికాకుపడటం, ఇతరులతో మాట్లాడకుండా ఏకాకిగా ఉండాలనుకుంటారు. తాము చేసే ప్రతిపనిలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిద్రలేమితో బాధపడటం. జీవితంలో తనకు కావాల్సింది ఏదీ దక్కలేదని పదేపదే ప్రస్తావించడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తులు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని గ్రహించాలి.

21వ స్థానంలో భారత్
ఆత్మహత్యల ర్యాకింగ్స్ పరిశీలిస్తే ప్రపంచ దేశాలలో భారత్ 21వ స్థానంలో ఉంది. డబ్ల్యూహెచ్ఓ 2018 లెక్కల ప్రకారం 16.3 సూసైడ్ రేట్ (ప్రతి లక్ష మందికి)తో భారత్‌లోనూ ఆత్మహత్యలు ఎక్కువేనని తేలింది. డబ్ల్యూహెచ్ఓ 2016 గణాంకాల ప్రకారం.. భారత్‌లో ప్రతి 1,00,000 జనాభాలో పురుషుల్లో ఆత్మహత్యల రేటు 18.5 శాతం ఉండగా, మహిళల రేటు 14.5శాతంగా ఉంది. మద్యపానం, ధూమపానంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో మగవారిలో ఆత్మహత్య లక్షణాలు ఎక్కువని తేలింది

2016 గణాంకాల ప్రకారం.. భారత్‌లో రాష్ట్రాలవారీగా ప్రతి లక్ష మంది జనాభాలో సూసైడ్ డెత్ రేట్(ఎస్‌డీఆర్) పరిశీలిస్తే 30.7తో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. త్రిపుర 30.3, తమిళనాడు 29.8రేట్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 22.4 ఎస్‌డీఆర్‌తో ఉన్నాయి.

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *