ఆ ఊరిలో ఇంటికో దెయ్యం.. కాలు పెడితే ‘కాంచన’ కనిపిస్తుంది!

రాజస్థాన్‌లోని జైసల్మార్ జిల్లాలో కుల్‌ధార అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్లు మొండి గోడలతో ధీనావస్థలో కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయం భయంగా చెబుతుంటారు. ఇదెంత వరకు వాస్తవమో తెలుసుకునేందుకు గౌరవ్ తివారీ అనే ఇండియన్ పరానార్మల్ సొసైటీ సభ్యుడు.. తన టీమ్‌తో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు ఉన్నాయని నిర్ధారించారు. అప్పటి నుంచి కుల్‌ధారకు ‘దెయ్యాల’ గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం లభించింది.

13వ శతాబ్దం నుంచి మనుగడలో ఉన్న ఈ గ్రామంలో సుమారు 1588 మంది నివసించేవారు. ఓ రోజు ఏమైందో ఏమో.. తెల్లవారేసరికి ఊరంతా ఖాళీ. నిత్యం సందడిగా కనిపించే ఆ ఊరిలో గాలి హోరు తప్ప మరే అలికిడి లేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఏవరూ నివసించే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం మొండి గోడలు… పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఒక్క రాత్రి గడిపితే చాలు.. ‘కాంచన’.. 1, 2, 3.. దాని మిగతా సీక్వెల్స్ కూడా చూసేయొచ్చట.

ప్రస్తుతం పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతంలో పగటి వేళల్లో మాత్రమే తిరగాలి. సూర్యాస్తమయం కాగానే నిశబ్దం నెలకొంటుంది. ఆ సమయంలో పర్యటకులకు అనుమతి ఉండదు. ఈ గ్రామం ఎందుకిలా మారిందనే ప్రశ్నకు స్థానికులు భిన్న కారణాలు చెబుతున్నారు. ‘సలీం సింగ్’ అనే మంత్రి వల్ల ఆ గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని, అతడి వల్లే ఊరంతా ఖాళీ అయ్యిందని తెలుపుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. జైశల్మార్‌ ప్రాంతం సలీమ్ సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది. అతడు కుల్దారా గ్రామంలో ఓ బాలికను ఇష్టపడ్డాడు. ఎలాగైన ఆమె తనకు సొంతం కావాలని, లేకుంటే గ్రామాన్ని స్మశానం చేస్తానని హెచ్చరించాడు. దీంతో గ్రామస్థులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేరుస్తామని చెప్పి, రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, బ్రిటీష్ వారి కాలంలో ఇక్కడ కరవు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజల వలసపోయారని మరికొందరు చెబుతారు. కానీ, ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నీటి కొలను ఎప్పుడూ నీటితో నిండి ఉండటాన్ని చూస్తుంటే.. అది ఎంత వరకు నిజమనే అనుమానాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రామానికి ఏర్పడిన పరిస్థితి ఇప్పటికీ మిస్టరీనే. దెయ్యాలను చూడాలనే ఆశగా ఉంటే మీరు ఓసారి ఆ ప్రాంతాన్ని చూసిరండి.

దెయ్యాలను పక్కన పెడితే.. పర్యటకపరంగా ఈ ప్రాంతం తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అప్పటి ఇళ్ల నిర్మాణ శైలి, చెక్కు చెదరని ఆలయాలు, మొండి గోడలు మధ్య ఫొటోలు దిగేందుకు పర్యటకులు ఇష్టపడతారు. జైపూర్ నుంచి 587 కిమీల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దెయ్యాలు కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడం మరిచిపోవద్దు!!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *